మూడు ప్రేమ కథలు..ఒకటే ముగింపు! డేటింగ్ హత్యలు

ముగ్గురి కథా ఓ వ్యథ.. ఆ ముగ్గురివి మూడు భిన్నమైన బ్యాక్‌గ్రౌండ్‌లు.. అయితే ప్రేమించడంలో, మోసపోవడంతో మాత్రం ముగ్గురు ఒకటే. ప్రేమించినవాడిని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నమ్మారు..
మనం ఏం చేసినా ఏదో ఒకటి తప్పుగా మాట్లాడుకునే సమాజం గురించి అసలు ఆలోచించలేదు.. కలిసి ఉండటానికి పెళ్లే అవ్వాల్సిన అవరసరం లేదని.. కలిసుంటే సరిపోతుందని డేటింగ్ జీవితంలోకి అడుగుపెట్టారు. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌కు డోర్స్ ఓపెన్‌గా ఉన్న కాలంలో ప్రేమించినవాడితో కలిసి జీవించారు. కొన్నాళ్లు ఆనందంగా గడిపారు. ప్రియుడి బుద్ధి తెలుసుకున్నాక నిలదీశారు… అదే వారి జీవితం పాలిట శాపమైంది. చేసిన పాపాన్ని ప్రశ్నించినందుకు హత్యకు గురయ్యారు.. అది కూడా అది ఘోరంగా.. అది దారుణంగా.. అతి కిరాతకంగా..! శ్రద్ధా(Shradda), నిక్కీ(Nikki), మేఘా(Megha).. ముగ్గురిది దాదాపు ఒకటే కథ.. ఒకటే ముగింపు. ఈ మూడు హత్యల్లోనూ మోస్ట్ కామన్ పాయింట్ లివ్-ఇన్ రిలేషన్‌షిప్.
నిక్కీ యాదవ్:
నిక్కీ యాదవ్ హత్య కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సాహిల్ గహ్లోత్ అనే యువకుడు తన లివ్ ఇన్ పార్ట్‌నర్ అయిన నిక్కీ యాదవ్(23)ను హతమార్చాడు. డేటా కేబుల్‍ను గొంతుకు బిగించి చంపేశాడు. తర్వాత దాదాపు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. తన కుటుంబానికి చెందిన దాబాలోని ఫ్రీజర్‌లో డెడ్‌బాడీని దాచిపెట్టాడు. ఏమీ ఎరగనట్టు వెళ్లి నిశ్చితార్థం జరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నాలుగు రోజులుగా తమ కూతురు కనిపించడం లేదని నిక్కీ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ చేసినా స్పందించడం లేదని తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిక్కీ కోసం వెతకగా ఫిబ్రవరి 14న ఓ దాబాలోని ఫ్రీజర్‌లో నిక్కీ మృత దేహం దొరికింది. సీసీటీవీ ఫుటేజీలో అసలు భాగోతం బయటపడింది. పోలీసులు సాహిల్‌ను అరెస్టు చేశారు. ఢిల్లిలో జరిగిన ఈ ఘటన డేటింగ్ కల్చర్‌పై మరోసారి చర్చకు దారి తీసింది.
మేఘా సింగ్ తోర్వి:
మేఘ (37), హార్దిక్ షాలు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఆరు నెలలుగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఒక నెల క్రితమే ముంబై సమీపంలో ఓ అద్దె ఇంట్లో ఇద్దరూ కలిసి ఉంటున్నారు. హార్దిక్‌కి ఉద్యోగం లేదు. మేఘా నర్స్‌గా పనిచేస్తోంది. ఇంటి ఖర్చులన్నీ ఆమె భరిస్తోంది. ఈ క్రమంలో వారిద్దరికీ రోజూ గొడవలు జరిగేవి. ఈ కారణంగానే హార్దిక్ మేఘాను హత్య చేసి.. బెడ్ బాక్స్‌లో ఉంచి.. ఆపైన ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మి.. ఆ డబ్బుతో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతను రైలులో మధ్యప్రదేశ్‌కి వెళుతున్నాడని విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని ట్రాక్ చేశారు. అతన్ని మధ్యప్రదేశ్‌లోని నాగ్డాలో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.
శ్రద్ధా వాకర్:
శ్రద్ధా వాకర్ కేసు దేశవ్యాప్తంగా ఎంత పెను సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. 18 మే 2022న అఫ్తాబ్ అమీన్ పూనావాలా (28) అనే యువకుడు తన 25 ఏళ్ల లివ్ ఇన్ పార్టనర్ శ్రద్ధా వాకర్‌ను గొంతు నులిమి చంపి ఆమె శరీరాన్ని 35 ముక్కలు చేశాడు. ఆమె శరీర భాగాలను నరికి, వాటిని కొత్తగా కొనుగోలు చేసిన ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. రోజుకు రెండు, మూడు ముక్కల చొప్పున మెహ్రౌలిలోని అడవిలో శ్రద్ధా మృతదేహాన్ని అఫ్తాబ్ పారేశాడు. శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన తర్వాత అఫ్తాబ్ మరో మహిళతో లవ్ ట్రాక్ నడిపాడు. అది కూడా శ్రద్ధా డెడ్‌బాడీ ఫ్రిడ్జిలో ఉంచుకునే ఆ మహిళను తన ఫ్లాట్‌కు తీసుకొచ్చాడు అఫ్తాబ్.