విశాఖ, హైదరాబాద్ వాసుల్లో తీవ్రంగా విటమిన్ డీ లోపం; యువతలోనే ఎక్కువ; షాకింగ్ అధ్యయనం!!

మనిషి ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేసేది విటమిన్ డి. మన శరీరంలో ఉండాల్సిన ముఖ్యమైన విటమిన్ లలో విటమిన్ డి ఒకటి. మనం అనేక వ్యాధుల బారిన పడకుండా విటమిన్ డి మనల్ని రక్షిస్తుంది.
అయితే ఇటువంటి కీలకమైన విటమిన్ డి లోపం వైజాగ్ వాసుల్లో మరీ తీవ్రంగా ఉందని, ఇక హైదరాబాద్ నగర వాసులలో తీవ్ర స్థాయిలో ఉందని తాజాగా ఒక అధ్యయనం వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ షాకింగ్ అధ్యయనంలో ముఖ్యంగా విటమిన్ డి లోపం ఉన్న వారిలో యువత ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది.
హైదరాబాద్ లో 76 శాతం మందిలో విటమిన్ డీ లోపం
ఇక ఈ డేటాను సేకరించిన అన్ని నగరాలలో విటమిన్ డి లోపంతో బాధపడుతున్న టాప్ స్థానాలలో 89%తో వడోదర, 88%తో సూరత్, 85%తో అహ్మదాబాద్ నగరాల ప్రజలు ఉన్నారు. ఇక విశాఖపట్నంలో 82% మందిలో విటమిన్ డి లోపం ఉన్నట్టుగా అధ్యయనంలో వెల్లడైంది. ఇక పెద్దవాళ్లతో పోలిస్తే యువతలోని ఈ లోపం ఎక్కువగా ఉందని, 25 ఏళ్లలోపు వయసు ఉన్నవారికి విటమిన్ డి డెఫిషియన్సీ 84 శాతం మందిలో ఉన్నట్టుగా గుర్తించారు. 25 ఏళ్ల నుండి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిలో 81 శాతం మందిలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నట్టుగా పేర్కొన్నారు.
యువతలో విటమిన్ డీ లోపం ఎక్కువగా ఉండటానికి కారణం ఇదే
ముఖ్యంగా యువతలోనే విటమిన్ డి లోపం ఉండడానికి ప్రధాన కారణం ఎండ తగలకుండా ఎక్కువ సమయం ఇల్లు, కార్యాలయాల్లోనే గడుపుతుండడం అని, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం అని చెబుతున్నారు. ఇక మనుషుల్లో విటమిన్ డి లోపానికి పరోక్షంగా కరోనా కూడా కారణమైందని భావిస్తున్నారు. శరీరానికి ఎటువంటి వ్యాయామం లేని వారే, కనీసం కాసేపు సూర్యరస్మికి కూడా నిలబడని వాళ్ళే విటమిన్ డీ లోపంతో ఇబ్బంది పడుతున్నారని తేల్చింది.
సహజంగా విటమిన్ డీ పెంచుకునే ప్రయత్నం చెయ్యండి
విటమిన్ డి పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ లోపం నుండి బయటపడతారని, అలాగే ఉదయం సూర్య రస్మి కూడా మనుషులలో విటమిన్ డి ని వృద్ధి చేస్తుందని చెబుతున్నారు. వీలైనంత వరకు విటమిన్ సప్లిమెంట్లు తీసుకోకుండా సహజ పద్ధతులలోనే విటమిన్ డి పెరుగుదలకు ప్రయత్నించాలని, కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని చెబుతున్నారు. విటమిన్ డీ లోపం ఉంటే విపరీతంగా నిస్సత్తువగా ఉంటుందని, బాగా ఒళ్ళు నొప్పులు ఉంటాయని అంటున్నారు. అందుకే విటమిన్ డీ లోపం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.