రష్యా బ్యాంక్ నుంచి రహస్యంగా..

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూప్ ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నదంటూ ‘హిండెన్‌బర్గ్’ రిసెర్చ్ సంస్థ చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూరింది.
దొడ్డిదారిన రుణం
అదానీ సోదరుడైన వినోద్ అదానీ నియంత్రణలో ఉన్న సింగపూర్‌కు చెందిన పినకల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ (పీటీఈ) కంపెనీ 2020లో రష్యా ప్రభుత్వానికి చెందిన వీటీబీ బ్యాంకుతో ఓ రుణ ఒప్పందాన్ని కుదుర్చుకొన్నట్టు ఫోర్బ్స్ పేర్కొన్నది. ఈ ఒప్పందం ప్రకారం 2021లో వీటీబీ బ్యాంకు నుంచి రూ.2,176 కోట్ల రుణాన్ని పినకల్ కంపెనీ తీసుకున్నట్టు తెలిపింది. ఈ రుణం తీసుకోవడం కోసం అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ పోర్ట్స్, అదానీ పవర్‌కు చెందిన షేర్లను వినోద్ అదానీ తాకట్టు పెట్టినట్టు వెల్లడించింది. ఈ షేర్లు అదానీ గ్రూప్ ప్రమోటర్ కంపెనీలైన ఆఫ్రో ఏషియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్, వరల్డ్ వైడ్ ఎమర్జింగ్ మార్కెట్ హోల్డింగ్ కంపెనీల పేర్లతో ఉన్నట్టు తెలిపింది. భారత కంపెనీల నిబంధనల మేరకు ప్రమోటర్లు తమ షేర్లను తాకట్టు పెడితే స్టాక్ ఎక్స్‌చేంజిలకు విధిగా ఆ విషయాన్ని తెలపాల్సి ఉంటుంది.
అయితే ఇప్పటి వరకు ఈ రుణానికి సంబంధించిన విషయాన్ని అదానీ గ్రూప్ రహస్యంగా ఉంచిందని ఫోర్బ్స్ ఆరోపించింది. అలాగే, బ్యాంక్‌కు సమర్పించిన పత్రాల్లో కూడా డొల్ల కంపెనీలను పేర్కొన్నట్టు, వాటికి సంబంధించి కొన్ని తప్పులను గుర్తించినట్టు వెల్లడించింది. అంటే ఒకవిధంగా మదుపర్లను, వాటాదార్లను మోసపుచ్చి అదానీ గ్రూప్, వినోద్ ద్వారా ఆర్థిక అవకతవకలకు పాల్పడి రష్యా బ్యాంకు నుంచి రుణాన్ని పొందినట్టు అర్థమవుతున్నది. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు తమదగ్గర ఉన్నాయని, కావాలంటే ఇస్తామంటూ ఫోర్బ్స్ తెలిపింది. తాము కనిపెట్టిన విషయాలపై అదానీ గ్రూప్‌తో పాటు ఈ అక్రమ లావాదేవీలకు సూత్రదారుడైన వినోద్ అదానీ స్పందనను కోరామని, అయితే వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని పత్రిక వెల్లడించింది.
అన్నీ అబద్ధాలే
హిండెన్‌బర్గ్ లేవనెత్తిన పలు ప్రశ్నలకు అదానీ గ్రూప్ పసలేని సమాధానమిచ్చింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ కంపెనీ నిధులు, ఆర్థిక లావాదేవీల గురించి తమకు తెలియదంటూ 413 పేజీలతో విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నది. దీనిపై హిండెన్‌బర్గ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ‘వినోద్ అదానీ, విదేశాల్లోని ఆయనకు చెందిన డొల్ల కంపెనీలతో అదానీ గ్రూప్ బిలియన్ డాలర్ల కొద్దీ అనుమానాస్పద లావాదేవీలు జరుపుతున్నట్టు నివేదికలో చెప్పాం. ఆ డొల్ల కంపెనీలతోనే అదానీ గ్రూప్ ఖాతాల్లో మోసాలు, షేర్లలో అవకతవకలకు పాల్పడుతున్నదని రుజువులతో సహా బయటపెట్టాం. వినోద్ అదానీ కంపెనీలకు బిలియన్ డాలర్ల నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అదానీ గ్రూప్‌ను ఈ క్రమంలోనే ప్రశ్నించాం. కానీ వీటికి అదానీ గ్రూప్ తన 413 పేజీల స్పందనలో జవాబు చెప్పలేదు.
అంతేకాకుండా వినోద్‌కి అదానీ గ్రూప్‌తో ఎలాంటి సంబంధంలేదని, వినోద్ కంపెనీ నిధుల గురించి తమకు తెలియదని బదులిచ్చింది. ఇది ఆశ్చర్యకరం’ అంటూ హిండెన్‌బర్గ్ దుయ్యబట్టింది. ఇప్పుడు ఫోర్బ్స్ కథనాన్ని విశ్లేషిస్తే, హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిజమేనని తెలుస్తున్నది. అదానీ గ్రూప్ అనుమతి లేకుండా కంపెనీ షేర్లను తాకట్టు పెట్టి వినోద్ కంపెనీ రుణం తీసుకోవడం సాధ్యంకాదు. అంతేకాకుండా, ఆ తీసుకొన్న రుణాన్ని కూడా వేరే మార్గంలో పరోక్షంగా అదానీ గ్రూప్‌కే లబ్ధిచేకూర్చేలా వినోద్ ప్రవర్తించారని వార్తలు వస్తున్నాయి. అంటే గౌతమ్ అదానీ కనుసన్నల్లోనే ఈ అక్రమ లావాదేవీలు పూర్తైనట్టు అర్థమవుతున్నది. గత వేసవిలో అంబుజా, ఏసీసీ సిమెంట్స్ కొనుగోలు సమయంలో మారిషస్‌కు చెందిన ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ తమ అనుబంధ సంస్థేనని అదానీ గ్రూప్ ప్రకటించింది. ఈ సంస్థ ద్వారానే అంబుజా, ఏసీసీ కంపెనీల షేర్లను కొననున్నట్టు వెల్లడించింది. కాగా ఈ ఎండీవర్ కంపెనీ సాక్షాత్తూ వినోద్‌దేనని ‘ఫోర్బ్స్’ బయటపెట్టింది. వెరసి వినోద్ అదానీ కంపెనీ నిధుల గురించి తమకు తెలియదంటూ 413 పేజీలతో అదానీ గ్రూప్ విడుదల చేసిన ప్రకటన ఓ తప్పుడు కథనమని అర్థమవుతున్నది. వినోద్ అదానీ ద్వారా గౌతమ్ అదానీ గ్రూప్ భారీగా లబ్ధి పొందినట్టు స్పష్టమవుతున్నది.
ఎవరీ వినోద్ అదానీ?
అదానీ గ్రూప్ వ్యాపార సామ్రాజ్య విస్తరణలో గౌతవ్‌ు అదానీ అన్న వినోద్ అదానీ కీలక పాత్ర పోషించినట్టు వార్తలు వస్తున్నాయి. దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వినోద్, సింగపూర్‌లో ఎక్కువగా ఉంటారని ఫోర్బ్స్ పేర్కొన్నది. ముప్పై ఏండ్లుగా ఈయన విదేశాల్లోనే ఉంటున్నట్టు వెల్లడించింది. వినోద్ శాంతిలాల్ అదానీ, వినోద్ శాంతిలాల్ షా అనే పేర్లతోనూ ఈయన్ని పిలుస్తారు. ప్రవాస భారతీయుడి (ఎన్‌ఆర్‌ఐ)గా ఈయన 60కి పైగా డొల్ల కంపెనీలను దుబా య్, సింగపూర్, మారిషస్, యూఏఈ, బహమాస్, బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్, సైమన్ ఐల్యాండ్స్ తదితర దేశాల నుంచి నడిపిస్తున్నట్టు సమాచారం. గత ఏడాది చివరి నాటికి వినోద్ అదానీ ఆస్తుల విలువ రూ.1.7 లక్షల కోట్లుగా చెబుతారు. మరే ఎన్నారైకి ఈ స్థాయి లో ఆస్తులు లేవు. ‘పనామా పేపర్ల’ కేసులోనూ వినోద్ అదానీ పేరు ఉన్నది. ఆ సమయంలోనే ఈయన వినోద్ శాంతిలాల్ షాగా పేరు మార్చుకున్నట్టు చెబుతారు. తమ గ్రూప్ కంపెనీల్లో వినోద్ అదానీకి ఎలాంటి ప్రమేయం లేదని అదానీ గ్రూప్ చెబుతున్నప్పటికీ, ఫోర్బ్స్ నివేదిక, అదానీ గ్రూప్ డాక్యుమెంట్లను పరిశీలిస్తే, అదానీ పవర్‌తో పాటు ఆరు గ్రూప్ కంపెనీల తెర వెనుక కార్యకలాపాలను వినోద్ చక్కబెడుతుంటారని స్పష్టమవుతున్నది. తమ్ముడు రాజేశ్ అదానీతో పాటు వినోద్ అదానీ కూడా రూ.6,800 కోట్ల వజ్రాల వ్యాపార కుంభకోణంలో నిందితుడిగా ఉన్నారు. వినోద్ కుమారుడు ప్రణవ్ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు ఎండీగా వ్యవహరిస్తుండటం గమనార్హం.
‘ఫోర్బ్స్’కు అదానీ వారు ఈసారి ఏం సమాధానం చెప్తారో??
- హిండెన్‌బర్గ్ (జనవరి 24): అదానీ గ్రూప్ స్టాక్ మ్యానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతున్నది.
- అదానీ గ్రూప్ (జనవరి 25): భారత్ వృద్ధిపై అక్కసుతోనే ఆరోపణలు చేస్తున్నారు.
- బ్లూమ్‌బర్గ్ (ఫిబ్రవరి 9): భారతదేశ ఆధునిక చరిత్రలో.. మరే ఇతర వ్యక్తి ఇంత తక్కువ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల్లో ఈ స్థాయిలో తన ఉనికిని చాటుకోలేదు. అదానీ గ్రూప్ ఎదుగుదల ఎన్నో అనుమానాలకు తావిస్తున్నది.
- అదానీ గ్రూప్ (ఫిబ్రవరి 10): విదేశీ మీడియా భారత కార్పొరేట్ కంపెనీలపై మూకుమ్మడిగా అక్కసు వెళ్లగక్కుతున్నది.
- ఫోర్బ్స్ (ఫిబ్రవరి 18): మదుపర్లకు తెలియకుండా షేర్లను తాకట్టు పెట్టి రష్యా ప్రభుత్వ బ్యాంక్ నుంచి రూ.2 వేల కోట్ల రుణాన్ని అదానీ గ్రూప్ తీసుకొన్నది. ఎక్స్‌చేంజిలకూ ఈ సమాచారం ఇవ్వలేదు. ఇది అక్రమం.
- అదానీ గ్రూప్: ??? (ఫోర్బ్స్ ప్రతినిధులు సంప్రదించినప్పటికీ, అందుబాటులోకి రాని అదానీ గ్రూప్ ప్రతినిధులు)