Tue. Mar 28th, 2023

సేవింగ్స్ డిపాజిట్లకు చెప్పేద్దాం బై బై!

ఎఫ్‌డీలతో మరింత రిటర్న్ పొందే అవకాశం
స్వీప్ ఇన్ సేవింగ్స్ అకౌంట్లు తీసుకుంటే మరిన్ని బెనిఫిట్స్‌
మంచి రిటర్న్ ఆఫర్ చేస్తున్న డెట్, లిక్విడ్ ఫండ్స్‌

కొత్త రోజులొచ్చాయి. సేవింగ్స్ డిపాజిట్లకు బై బై చెప్పే టైమ్ వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచుతుండడంతో బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ) పై ఇస్తున్న వడ్డీ పెరుగుతోంది. ఏడాది కాల వ్యవధి ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 0.35 శాతం నుంచి 2.75 శాతం వరకు పెరిగింది. అంటే పెద్ద బ్యాంకులు సైతం ఏడాదికి 7.5 శాతం వరకు వడ్డీని ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. కొన్ని స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్‌లు సీనియర్ సిటిజన్ల కోసం 9 శాతం వరకు కూడా వడ్డీ రేటు ఆఫర్‌ చేస్తున్నాయి. మరోవైపు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు పెరిగినంతగా సేవింగ్స్ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ పెరగడం లేదు. ఇప్పటికీ మెజార్టీ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లపై ఇస్తున్న వడ్డీ ఏడాదికి 3 శాతం దగ్గరలోనే ఉంది.

ఆర్‌బీఎల్, డీసీబీ, బంధన్ బ్యాంక్‌లు, ఈక్విటాస్‌, ఉజ్జీవన్ వంటి స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లపై ఏడాదికి 7.25 శాతం వరకు ఇస్తున్నా, వీటిని పెద్ద బ్యాంకులతో పోల్చలేం. బ్యాంక్‌బజార్ డేటా ప్రకారం, ఏడాది కంటే తక్కువ కాల వ్యవధి ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ గత ఏడాదిన్నర కాలంలో 0.35-2.75 శాతం వరకు పెరిగింది. 1-2 ఏళ్ల మధ్య కాల వ్యవధి ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ 0.75-2.5 శాతం వరకు, 2-3 ఏళ్ల కాల వ్యవధి ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ 0.35-2.25 శాతం వరకు పెరిగింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ పెరగడంతో బ్యాంకుల కాసా (కరెంట్ అకౌంట్ అండ్‌ సేవింగ్స్ అకౌంట్‌) డిపాజిట్‌లు కొద్దిగా తగ్గే అవకాశముందని ఎనలిస్టులు చెబుతున్నారు. సాధారణంగా కాసా అకౌంట్ల ద్వారా బ్యాంకులకు తక్కువ వడ్డీకే ఫండ్స్ దొరుకుతాయి. ‘సేవింగ్స్ అకౌంట్లపై ఇస్తున్న వడ్డీ గత మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి 2.70 – 3 శాతం రేంజ్‌లో ఉంది. అంతకు ముందు గరిష్టంగా ఏడాదికి 4 శాతం వరకు వెళ్లింది’ అని క్రిసిల్‌ మార్కెట్ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్ (రీసెర్చ్‌) అంకిత్‌ దాని అన్నారు. రెపో రేటు పెరిగినంత మాత్రాన ఈ రేట్లలో పెద్దగా మార్పులుండవని చెప్పారు.

నచ్చినప్పుడు విత్‌డ్రా చేసుకునే ఎఫ్‌డీలు..

సేవింగ్స్ అకౌంట్లలోని డబ్బులను ఎప్పుడైనా ఛార్జీలు చెల్లించకుండా వాడుకోవచ్చు. కానీ, ఎఫ్‌డీలు అలా కాదు. మెచ్యూర్ కాకముందే విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే ఛార్జీలు కట్టక తప్పదు. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఇతర మార్గాలు కూడా లేకపోలేదు. ఇందులో ఒక ఆప్షన్‌ ‘స్వీప్‌ ఇన్‌’ ఫెసిలిటీ ఉన్న సేవింగ్స్ అకౌంట్‌లను తీసుకోవడం. ఇటువంటి సేవింగ్స్ అకౌంట్‌ను ఎఫ్‌డీ అకౌంట్‌కు లింక్ చేస్తారు. దీంతో ఫండ్స్‌ను ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ కింద క్రియేట్ అయిన ఎఫ్‌డీలు సాధారణ ఎఫ్‌డీల మాదిరే వడ్డీని ఆఫర్ చేస్తాయి. ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే, కనీస అమౌంట్ కంటే ఎక్కువ ఉన్న ఫండ్స్‌ ఈ అకౌంట్‌కు లింక్ ఉన్న ఎఫ్‌డీ అకౌంట్‌కు షిఫ్ట్ అయిపోతాయి. ఉదాహరణకు, ఒక స్వీప్‌ ఇన్ సేవింగ్స్ అకౌంట్‌లో రూ.60 వేలు దాటిన తర్వాత డిపాజిట్‌ అయిన ప్రతీ రూ.10,000 ఎఫ్‌డీ అకౌంట్‌కు ఆటోమెటిక్‌గా షిఫ్ట్ చేసుకోవచ్చు. అలానే ఈ కనీస బ్యాలెన్స్ ఎంత తగ్గితే అంత అమౌంట్‌ ఎఫ్‌డీల నుంచి లిక్విడేట్ అయ్యి తిరిగి సేవింగ్స్ అకౌంట్‌లోకి వస్తుంది. ఈ అకౌంట్లపై ప్రీమెచ్యూర్ ఛార్జీలు ఉండవు. కానీ, ప్రతీసారి ఎఫ్‌డీల నుంచి అమౌంట్ విత్‌డ్రా అవుతుంటే, వచ్చే వడ్డీ తగ్గిపోతుంది.

ఇటువంటి టైప్ అకౌంట్లలో బ్యాంక్ వద్ద ఎఫ్‌డీ ఎన్ని రోజులు ఉందనే దాని ఆధారంగా వడ్డీ ఇస్తారు. ఉదాహరణకు, ఏడాది కాల వ్యవధి స్వీప్‌ ఇన్‌ ఎఫ్‌డీని తీసుకున్నా, కేవలం 45 రోజులే ఎఫ్‌డీ ఉంచితే ఈ రోజులకే వడ్డీ ఇస్తారు. మరోవైపు ఇటువంటి టైప్ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టీ పడుతుంది. వీటిని ఫ్లెక్సీ ఎఫ్‌డీ అకౌంట్లని అంటున్నారు.

7.39% వరకు రిటర్న్‌

ప్రస్తుతం మార్కెట్‌లో షార్ట్ టెర్మ్ డెట్‌ ఫండ్స్‌, మనీ మార్కెట్ ఫండ్స్ 6.15- 7.39 శాతం వరకు (ఖర్చులు పోను) రిటర్న్ ఇస్తున్నాయి. రెండేళ్ల క్రితం వరకు ఈ రిటర్న్ 2.95- 4.12 శాతం మధ్య ఉండేది. మరోవైపు మన డబ్బులను డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే లిక్విడ్ ఫండ్స్‌, మనీ మార్కెట్ ఫండ్స్ కూడా సేవింగ్స్ అకౌంట్ల కంటే మంచి రిటర్న్ ఆఫర్ చేస్తున్నాయి. నచ్చినప్పుడు ఫండ్స్ విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే లిక్విడ్ ఫండ్స్ బెటర్. చాలా మ్యూచువల్‌ పండ్స్ ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి.