అమృతపాల్‌సింగ్ అనుచరులపై ఎన్‌ఎస్‌ఎ చట్టం .. కొనసాగుతున్న గాలింపు

చండీగఢ్ : పరారీలో ఉన్న ఖలిస్తాన్ వేర్పాటు వాద నేత అమఅత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట సోమవారం కూడా కొనసాగుతోంది.
శనివారం రాత్రి పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకోవడంతో పంజాబ్‌లో హై అలర్ట్ ప్రకటించి.. గాలింపు చేపడతున్న సంగతి తెలిసిందే. రహదారులపై భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అమృతపాల్ మామ హర్జిత్ సింగ్, డ్రైవర్ హరప్రీత్ సింగ్ ఆదివారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు జలంధర్ రూరల్ సీనియర్ ఎస్‌పి స్వరణ్ దీప్ సింగ్ వెల్లడించారు. ఇప్పటివరకు 112 మంది అమృతపాల్ సానుభూతిపరులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇంటర్నెట్ సేవలను సోమవారం మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్‌పై నిషేధం కొనసాగుతుందని ప్రకటించారు. అమృత్‌పాల్ సింగ్ నలుగురు ముఖ్య అనుచరులను అరెస్ట్ చేసి ఎగువ అస్సాంలోని దిబ్రూఘర్‌కి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు.
లండన్‌లోని భారత హైకమిషన్ వెలుపల ఖలిస్తాన్ సానుభూతి పరుడు జాతీయ జెండాను కిందకి దింపి అగౌరవపరిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం సాయంత్రం బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ క్రిస్టినా స్కాట్‌ను వివరణ కోరింది. నిరసనకారులు భారత హైకమిషన్‌కు వచ్చేంత వరకు అక్కడి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. భారత దౌత్య కార్యాలయ ప్రాంగణం, అక్కడి సిబ్బంది భద్రత పట్ల బ్రిటన్ ప్రభుత్వ ఉదాసీనత ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.