జనగామలో విషవాయువుల కలకలం.. పలువురికి అస్వస్థత.. కారణం ఏంటంటే!!

జనగామ జిల్లా కేంద్రంలో విషవాయువులు కలకలం రేపాయి. జనగామలోని గీత నగర్ కాలనీ సమీపంలో క్లోరైడ్ సిలిండర్ లీక్ కావడంతో స్థానిక ప్రజలు అస్వస్థతకు గురయ్యారు.
ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలేం జరిగిందో అర్ధం కాక జనగామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఇంతకు ఏం జరిగిందంటే జనగామ జిల్లా కేంద్రంలోని సబ్ జైల్ గీతా నగర్ ఏరియాలో విష వాయువు ప్రభావంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సబ్ జైలు వద్ద గల ఓవర్ హెడ్ ట్యాంక్ వద్ద నీళ్ళలో కలిపే క్లోరైడ్ సిలిండర్ పైప్ లీకేజీ జరిగి విషవాయువు బయటికి రావడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు ఈ వాయువును పీలిచి శ్వాస ఆడక దగ్గుతూ అవస్థ పడ్డారు. ఆ దారిన వెళ్తున్న పాదచారులు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇలా సుమారు 40 మందికి పైగా ఊపిరి ఆడక విపరీతమైన దగ్గు రావడంతో వారంతా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
ఇక ఈ విషయం తెలిసిన అధికారులు అప్రమత్తం అయ్యారు. ఘటనకు గల కారణాలు తెలుసుకుని సమస్యను పరిష్కరించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు . జనగామ లోని 100 పడకల జిల్లా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న బాధితులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ పరామర్శించారు . ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వారందరికీ ఏమీ కాదని భరోసా ఇచ్చారు.
ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్ రాజు బాధితులు అందరికీ చికిత్స అందిస్తున్నామని, ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగు పడగానే డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. నీటిలో కలిపే క్లోరైడ్ గ్యాస్ లీక్ అవడం వల్ల , పీల్చిన వారికి శ్వాస సమస్య వచ్చినట్లు భావిస్తునట్లు తెలిపారు. ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆయన స్పష్టం చేశారు.