ఆర్టీసీ బస్సును నడిపిన కొడాలి నాని.. వైరల్‌గా మారిన వీడియో

నేతలు ఏదైనా చేస్తే.. అది వైరల్‌గా మారిపోతోంది.. ఎన్నికల ప్రచార పర్వంలోనే కాదు.. కొత్త పథకాలను ప్రారంభించినప్పుడు..
ఇంకా ఏదైనా కొత్తగా ఓపెన్ చేసినప్పుడు.. తమలోని స్కిల్‌ను బయటపెట్టేస్తుంటారు.. తాజా, మాజీ మంత్రి, గుడివాడ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. ప్రతీరోజూ ప్రతిపక్షాలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడే కొడాలి నాని.. ఒక్కసారిగా ఆర్టీసీ డ్రైవర్ అవతారం ఎత్తేశారు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లాంటి నేతలపై పవర్ పంచ్‌లు విసిరే కొడాలి.. స్టీరింగ్ పట్టారు.. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది..
ఇంతకీ, కొడాలి నాని ఆర్టీసీ బస్సును ఎందుకు నడపాల్సి వచ్చింది అనే వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా గుడివాడ ఆర్టీసీ డిపో పరిధిలో కొత్తగా ఐదు హైర్ బస్సులను ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని.. అంతేకాదండోయ్ ఇదే సమయంలో తనలో ఉన్న డ్రైవింగ్ స్కిల్‌ను ప్రదర్శించారు.. నూతనంగా ప్రారంభించిన బస్సును పట్టణ ప్రధాన రహదారుల్లో స్వయంగా నడిపారు.. అయితే, ఆ దృశ్యాలను కెమెరాలో సంబంధించి సోషల్ మీడియాలో వదలడంతో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. ఇక, గుడివాడ నుండి బంటుమిల్లి, కైకలూరు మధ్య నూతన సర్వీసులను ప్రారంభించి కొడాలి నాని.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద దళిత సోదరులు ఏర్పాటు చేస్తున్న బస్సులను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.. దళిత వర్గాల శ్రేయస్సుకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.