Wed. Mar 22nd, 2023

జగన్ మంత్రివర్గంలోకి కొడాలి నాని, తోట త్రిమూర్తులు?

చ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకనుగుణంగా పావులు కదుపుతున్నారు.

మొదటి మంత్రివర్గాన్ని తొలగించి రెండో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తన అంచనాలకు అనుగుణంగా రెండో మంత్రివర్గం పనిచేయలేకపోతోందని జగన్ భావిస్తున్నారు. దీంతో కొంతమంది ఫైర్ బ్రాండ్స్ ను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

అంతరంగికులతో జగన్ మంతనాలు

ముందస్తు ఎన్నికలతోపాటు ఎవరిని మంత్రివర్గంలోకి తిరిగి తీసుకుంటారనే విషయమై కొన్నాళ్లుగా పార్టీలో చర్చ నడుస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డితో మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడమే కాకుండా ముందస్తు ఎన్నికలతోపాటు ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే అంశంపై వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

రాష్ట్రంలో రాజుకున్న రాజకీయవేడి

ఒకవైపు యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తుండటంతోపాటు మరోవైపు నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటనలు జరుపుతుండటం, వారాహి పేరుతో పవన్ కల్యాణ్ యాత్ర చేసేందుకు ముహూర్తాలు చూసుకుంటుండటంతో రాష్ట్రంలో రాజకీయవేడి రాజుకుందని అభిప్రాయపడ్డారు. వైసీపీలో ఎక్కడెక్కడ అసంతృప్తి నెలకొందో గుర్తించి దాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించాలని నిర్ణయించారు.

ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం ఇవ్వాలని..

మంత్రివర్గాన్ని మరోసారి విస్తరించడంద్వారా ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం ఇచ్చే ఫైర్ బ్రాండ్స్ ను తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చే కొడాలి నాని, తోట త్రిమూర్తులు లాంటి ఫైర్ బ్రాండ్స్ కు అవకాశం ఇస్తారని వార్తలు వస్తున్నాయి.

అందరూ ఆశించినట్లుగా జగన్ తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పనితీరు బాగోలేకపోతే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటానని, తర్వాత తనను విమర్శించినా తాను పట్టించుకోనంటూ మొదటి నుంచి జగన్ చెబుతూనే ఉన్నారు. మంత్రివర్గం నుంచి తొలగించే నేతలు ఎవరై ఉంటారా? అనే చర్చ వైసీపీ వర్గాల్లో నడుస్తోంది.