Tue. Mar 28th, 2023

భారత్ లో ఎన్నికల్ని శాసిస్తున్న ఇజ్రాయెల్ సంస్ధ ? బయటపెట్టిన అంతర్జాతీయ జర్నలిస్టులు..!

భారత్ లో ఎన్నికల్ని సోషల్ మీడియా సంస్ధలు ప్రభావితం చేస్తున్నట్లు ఇప్పటికే విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ సోషల్ దిగ్గజాల సాయంతో భారత్ లో బీజేపీ విపక్షాల్ని టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఇప్పుడు అంతర్జాతీయ జర్నలిస్టుల గ్రూప్ ఒకటి ఇదే విషయాన్ని తమ పరిశోధనలో తేల్చింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ కు చెందిన ఓ నిఘా సంస్ధ సాయంతో ఈ కుట్రకు పాల్పడుతున్నట్లు చేసిన ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ బయయపెట్టింది.

భారత్ లో ఎన్నికలపై విదేశీ ప్రభావంభారత్ లో జరిగే ఎన్నికలపై విదేశీ శక్తులు ప్రభావం చూపుతున్నాయా ? దేశంలో అధికారంలో ఉన్న పార్టీలు, రావాలనుకుంటున్న పార్టీలు విదేశీ నిఘా సంస్ధల సాయంతో ఎన్నికల ఫలితాల్ని మార్చేందుకు, ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయా అంటే అవుననే సమాధానం కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది. అంతెందుకు ఏపీలో సైతం గత టీడీపీ ప్రభుత్వం ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్ వేర్ సాయంతో తమను టార్గెట్ చేసి ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించిందని వైసీపీ గతంలో ఆరోపణలు చేసింది. ఇప్పుడు దేశంలో ఎన్నికల్ని ప్రభావితం చేసేందుకు విదేశాల్లో జరుగుతున్న ప్రయత్నాలపై మరో కుట్ర వెలుగుచూసింది.

ఇజ్రాయెల్ నిఘా సంస్ధ టీమ్ జార్జ్

భారత్ లో ఎన్నికల్ని ప్రభావితం చేసేందుకు ఇజ్రాయెల్ కు చెందిన నిఘా సంస్ధ టీమ్ జార్జ్ ప్రయత్నాలు చేస్తోందని అంతర్జాతీయ జర్నలిస్టుల గ్రూప్ ఒకటి తాజాగా గుర్తించిది. భారత్ లో సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ ను, పోస్టుల్ని హ్యాక్ చేసి ఇక్కడి అధికార పార్టీకి అనుకూలంగా జనాభిప్రాయాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు జర్నలిస్టులు తాజాగా బయటపెట్టారు. టీమ్ జార్జ్ పేరుతో నడుస్తున్న ఇజ్రాయెల్ కాంట్రాక్టర్ల బృందం, బీజేపీ ఐటీ సెల్ పనితీరు ఒకేలా ఉండటం ఈ ఆరోపణలకు బలాన్నిస్తోంది.

టీమ్ జార్జ్ పనితీరు ఇలా..

ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా ఎన్నికలను ప్రభావితం చేస్తోందని అనుమానిస్తున్న ఇజ్రాయెల్ సంస్ధ ‘టీమ్ జార్జ్’ భారత్‌తో సహా దేశాలలో నకిలీ సోషల్ మీడియా ప్రచారాలను నిర్వహించడానికి సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించినట్లు తాజాగా ఓ నివేదిక వెలువడింది. అంతర్జాతీయ జర్నలిస్టుల గ్రూప్ ఒకటి ఈ వివరాలు బయటపెట్టింది. జర్నలిస్టుల బృందం నిర్వహించిన అంతర్జాతీయ దర్యాప్తులో ‘టీమ్ జార్జ్’ యూనిట్ దాని వాణిజ్య ఖాతాదారులకు అడ్వాన్స్‌డ్ ఇంపాక్ట్ మీడియా సొల్యూషన్స్ (AIMS) అనే అధునాతన సాఫ్ట్‌వేర్ ప్యాకేజీని దాని కీలక సేవల్లో ఒకటిగా అందిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

కేంద్రం మౌనం వీడాలన్న కాంగ్రెస్

భారత్ లో జరిగే ఎన్నికలలో జోక్యం చేసుకోవడానికి ఇజ్రాయెల్ కాంట్రాక్టర్ల బృందాన్ని ఉపయోగించుకున్నారనే ఆరోపణలపై విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వం తన మౌనాన్ని వీడాలని కోరింది. ఎన్నికల్ని ప్రభావితం చేయడానికి నకిలీ వార్తల్ని జనంలోకి పంపుతూ ఇజ్రాయెల్ సంస్ధ టీమ్ జార్జ్ చేస్తున్న కుట్రలతో దేశంలో భారతీయుల డేటా కూడా చోరీ అవుతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధులు పవన్ ఖేరా, సుప్రియా శ్రీనటే ఆరోపించారు. ఇది నిజం కాదని భావిస్తే ఈ వ్యవహారాన్న బయటపెట్టిన సదరు అంతర్జాతీయ జర్నలిస్టుల ఏజెన్సీకి కేంద్రం సమాధానం చెప్పాలని వారు కోరారు.