తల్లి క్యాన్సర్‌తో చనిపోయింది.. ఎన్నో అవరోధాలను అధిగమించి వందో టెస్టుకు రెడీ అయ్యాడు

దుర్బేధ్యమైన డిఫెన్స్‌తో గంటలపాటు క్రీజ్‌లో నిలిచిపోయే ఆటగాడు అతను..
టీమ్ కష్టాల్లో ఉంటే బ్యాట్‌తోనే కాదు.. బాడీతోనూ అడ్డుగోడగా నిలిచిన సందర్భాలున్నాయి. అతడిని అవుట్ చేయలేక ఆస్ట్రేలియా బౌలర్లు బాడీని టార్గెట్ చేస్తూ బంతులు వేసినా.. వెన్నుచూపని వీరుడతాను.. 13ఏళ్లుగా భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన చతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara).. ఇప్పుడు అరుదైన 100వ టెస్టు మైలురాయిని చేరుకుంటున్నాడు.
రేపటి నుంచి ఆ్రస్టేలియా(Australia)తో జరిగే టెస్టు పుజారాకు వందోది కానుంది. ఈ ఘనత సాధించిన 13వ భారత ఆటగాడిగా పుజారా నిలవనున్నాడు.
నిజానికి టెస్టు క్రికెట్ ఆడడం ప్రతీ ఆటగాడి కల.. వందల టీ20లు ఆడినా.. వన్డేల్లో వేల కొద్దీ పరుగులు చేసినా.. టెస్టు క్రికెట్‌లో నిలదొక్కుకోలేకపోయిన బ్యాటర్లు చాలా మంది ఉన్నారు. అయితే పుజారా మాత్రం టెస్టుల్లో ఏకంగా వంద మ్యాచ్‌లు ఆడిన రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు.
అసలైన సంప్రదాయ క్రికెట్‌కు టెస్టులో నిదర్శనం.. అలాంటి టెస్టులకు పుజారా అందించిన సేవ అపురూపం. తన అసమాన పట్టుదల, ఏకాగ్రతతో ప్రపంచ క్రికెట్ ప్రేమికుల మనసుల్లో పుజారా పేరు ఎప్పటికీ నిలిచే ఉంటుంది.
2010లో ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్ ఆడిన పుజారా.. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనే అర్ధశతకం సాధించాడు. కెరీర్‌లో ఎత్తు పల్లాలు వచ్చినా వాటిని ఎదుర్కొని నిలబడ్డాడు. ఇప్పటివరకు 99మ్యాచ్‌లు ఆడిన పుజారా.. 19 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలతో 7,021 పరుగులు సాధించాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 44.16గా ఉంది.
అక్టోబర్ 9, 2005లో పుజారా 17ఏళ్ల వయసులో ఉన్నప్పుడే వాళ్ల అమ్మ క్యాన్సర్‌తో చనిపోయారు.. సరిగ్గా అదే రోజు 5ఏళ్ల తర్వాత(2010 అక్టోబర్ 9న) పుజారా తొలి టెస్టు ఆడాడు. ఒకవైపు ఆనందం, మరోవైపు అమ్మను గుర్తు చేసుకుంటూ మ్యాచ్ బరిలోకి దిగిన పుజారా తొలి ఇన్నింగ్స్ 3 పరుగులకే పరిమితమైంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ద్రవిడ్‌ను కాదని పుజారాను ధోని మూడో స్థానంలో పంపడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఇక కీలక అర్ధసెంచరీతో అతను రాబోయే రోజుల గురించి సంకేతాలిచ్చాడు.
పుజారా కెరీర్‌లో ఎన్నో ప్రత్యేక ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. అయితే అందులో ఆస్ట్రేలియాపై అతను ఆడిన ఇన్నింగ్స్.. ఇప్పటికీ అభిమానుల గుండెల్లో పదిలంగా ఉంది. 2018-19 సిరీస్‌లో 3 సెంచరీలు సహా ఏకంగా 521 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.
ఇక రేపటి వందో టెస్టుకు యావత్ క్రికెట్ ప్రేమికులు పుజారాకు బెస్ట్ విషెస్ చెబుతుండగా..తన మైల్‌స్టోన్ మ్యాచ్‌కు ముందు పుజారా ప్రధాని నరేంద్ర మోదీ(Modi)ని కలిసేందుకు వెళ్లాడు.
అటు టీమిండియా హెడ్ కోచ్.. ది గ్రేట్ ఇండియన్ వాల్ ద్రవిడ్.. నయా వాల్ పుజారాపై ప్రసంశలు కురిపించాడు. దశాబ్ద కాలంగా పుజారా టెస్టు క్రికెట్‌లో అద్భుతుంగా రాణించాడన్నాడు.