Tue. Mar 28th, 2023

దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాకు తగ్గని క్రేజ్‌.. రీరిలీజ్‌లోనూ రికార్డు కలెక్షన్స్‌

ప్పట్లో షారుఖ్‌ చూపుల్లో చిక్కుకున్న అమ్మాయిల మాట ఇది. కాజోల్‌ కాటుక కండ్లకు పడిపోయిన అబ్బాయిలైతే ‘తేరీ బాహోఁమే మర్‌జాయె హమ్‌’ అని లీలగా హమ్‌ చేస్తుంటారు.

DDLJ Rerelease | వెండితెరపై ప్రేమకావ్యాలు ఎన్నో వచ్చిపోయాయి. అలా వచ్చినవాటిలో కొన్ని సంచలనాలు సృష్టించాయి. ప్రేమికులకు దిక్సూచి అయ్యాయి. వాటిల్లో.. ఒక తరాన్ని ప్రేమ తీరానికి చేర్చిన ఘనత దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాకు దక్కుతుంది. 1995లో విడుదలైన ఈ చిత్రం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవడం? అంటే, రీ-రిలీజ్‌ ట్రెండ్‌లో భాగంగా మరో సారి విడుదల కావడమే! రిలీజైన చోటల్లా రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తుండటం డీడీఎల్జే క్రేజ్‌ ఇప్పటికీ తగ్గలేదని చెబుతున్నది.

‘అబ్‌ యహాసే కహా జాయె హమ్‌….’

అప్పట్లో షారుఖ్‌ చూపుల్లో చిక్కుకున్న అమ్మాయిల మాట ఇది. కాజోల్‌ కాటుక కండ్లకు పడిపోయిన అబ్బాయిలైతే ‘తేరీ బాహోఁమే మర్‌జాయె హమ్‌’ అని లీలగా హమ్‌ చేస్తుంటారు.

ఈ దిల్‌వాలే.. దుల్హనియాను మాత్రమే తీసుకుపోలేదు. ఎందరినో తన వెంట ఇంకా నడిపిస్తూనే ఉన్నాడు. సదరు పెండ్లికూతురు కాజోల్‌ మాత్రం తక్కువా! ఆమెకు పెండ్లయినా, ఇద్దరు పిల్లలకు తల్లయినా.. అప్పటి యువతకు మాత్రం ఇప్పటికీ, ఎప్పటికీ నయా దుల్హనియానే!! ముంబైలోని మరాఠా మందిర్‌ కథ తెలిసిందే కదా. ఆట ఆటకూ కొత్త రికార్డు సృష్టిస్తూనే ఉంది. 1995 అక్టోబర్‌ 20న సినిమా రిలీజైతే..

ఇప్పటికీ ఆ థియేటర్‌లో ఒక ఆట ఆడుతూనే ఉంది. లాక్‌డౌన్‌ సమయంలో మినహాయిస్తే.. నేటికీ ప్రతి మార్నింగ్‌ షో డీడీఎల్జే ఆడుతూనే ఉంది. ప్రతి ఉదయం 11.30 గంటలకు దిల్‌వాలే మరాఠా మందిర్‌ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు. సగటున రోజూ 100 మంది ఈ సినిమాను వీక్షిస్తున్నారట!
ఇదేదో స్పెషల్‌ థియేటర్‌, మరేదో కారణంతో సినిమా ఆడిస్తున్నారేమో అనుకున్నా! ఈ నెల 10న రీ-రిలీజ్‌ తర్వాత డీడీఎల్జేకు అంతే ఆదరణ దక్కింది. ఒక పక్క షారుఖ్‌ తాజా చిత్రం ‘పఠాన్‌’ రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తుండగా, రీ-రిలీజ్‌లోనూ రికార్డు రెవెన్యూ సాధిస్తున్న చిత్రంగా డీడీఎల్జే ప్రత్యేకతను చాటుకుంటున్నది.

అంతగా ఏముంది ఈ సినిమాలో.. ఏమైనా కళాఖండమా..? అని ప్రశ్నిస్తే, అవుననరూ, కాదనరు! ఏముందని అన్నిసార్లు ఆ సినిమా చూస్తారని అడిగితే.. సమర్థించుకోలేరు!! కానీ, టీవీలో డీడీఎల్జే బొమ్మ వచ్చిందా..! ఇప్పటికీ కన్నార్పకుండా చూసేవాళ్లు కోకొల్లలు. కథలోకి వెళ్తే.. రాజ్‌ ప్రవాస భారతీయ యువకుడు. సిమ్రాన్‌ కుటుంబమూ విదేశాల్లో స్థిరపడిందే! ఓ స్నేహితుడి పెండ్లిలో సిమ్రాన్‌ను చూసి మనసు పారేసుకుంటాడు రాజ్‌. ఆమె కూడా రాజ్‌ను ఇష్టపడుతుంది. కానీ, పెద్దలు ఆమెకు వేరే పెండ్లి సంబంధం చూస్తారు. పెండ్లి కోసం ఆమె కుటుంబం ఇండియాకు వస్తుంది. రాజ్‌ కూడా ఆమె కోసం భారత్‌కు వస్తాడు. పెద్దలను ఒప్పించి, కుదిరిన పెండ్లిని తప్పించి.. సిమ్రాన్‌ను పెండ్లి చేసుకుంటాడు. సాదాసీదా ప్రేమకథ! కానీ, షారుఖ్‌, కాజోల్‌ జంటను ఆనాటి యువత ఆరాధించింది. ఒంటరిగా ఈ సినిమాకు వెళ్లి జంటలుగా తిరిగొచ్చిన సందర్భాలూ ఉన్నాయంటే.. డీడీఎల్జే యువతను ఎంతగా ప్రభావితం చేసిందో చెప్పొచ్చు.

డీడీఎల్జే విజయంలో పాటలది కీలకపాత్ర. సంగీత దర్శకులు జతిన్‌- లలిత్‌ స్వరపరచిన గీతాలు ఎవర్‌ గ్రీన్‌ లిస్ట్‌లో చేరిపోయాయి. లతా మంగేష్కర్‌, కుమార్‌ సాను, ఉదిత్‌ నారాయణ్‌ గళాలు ఇంటింటా ప్రతిధ్వనించాయి. దీనికితోడు అప్పటివరకు వచ్చిన సినిమాలకు భిన్నంగా చూపించడంలో దర్శకుడు ఆదిత్య చోప్రా సక్సెస్‌ అయ్యాడు. యూరప్‌ లొకేషన్లు, పెండ్లి సందళ్లు, మెహందీ ముచ్చట్లు ప్రతి ఫ్రేమూ ఫ్రెష్‌గా కనిపించడంతో జనం ఈ సినిమాకు నీరాజనం పట్టారు.

చివరిగా.. 1995లో డీడీఎల్జే చిత్రానికి జంటగా వెళ్లిన వాళ్లకు ఓ కొడుకో, కూతురో పుట్టి ఉంటే.. ఇప్పుడు వాళ్లకూ జట్టుకట్టే వయసొచ్చే ఉంటుంది. ఈ యువతీయువకుల తల్లిదండ్రులు అప్పట్లో ఆ సినిమా చూసే ఉంటే.. ఈ పూట ఆ ఆట చూస్తామని చెప్పీచెప్పగానే.. ‘క్షేమంగా వెళ్లి.. లాభంగా రండి’ అని ఆశీర్వదించకుండా ఉండలేరు!

రీ-రిలీజ్‌ బాటలో మరిన్ని

రీ-రిలీజ్‌ ట్రెండ్‌ ఈ మధ్య బాగా పాపులర్‌ అయింది. తెలుగునాట వరుసగా పాతసినిమాలు కొత్త లుక్‌తో విడుదల అవుతున్నాయి. వివి వినాయక్‌, జూ.ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌ హిట్‌ సినిమా అదుర్స్‌ మార్చి 4న విడుదల కాబోతున్నది. తారక్‌-బ్రహ్మానందం కామెడీ రిపీట్స్‌ అంటూ ఇప్పటికే ప్రచారం జోరందుకుంది. ఇంతకుముందే పోకిరి, జల్సా, ఖుషీ తదితర చిత్రాలు రీ-రిలీజ్‌లోనూ ఫ్యాన్స్‌ను అలరించాయి. రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు మరోసారి విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక, హిందీలోనూ రీ-రిలీజ్‌ ట్రెండ్‌ ఊపందుకుంది. 2007లో వచ్చిన షాహిద్‌ కపూర్‌ చిత్రం ‘జబ్‌ వి మెట్‌’ ఫిబ్రవరి 10న విడుదలైంది. ప్రేమికుల రోజు సందర్భంగా టైటానిక్‌ సినిమాను కూడా కొన్ని థియేటర్లలో ఘనంగా రీ-రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలు వారం రోజులపాటూ అభిమానులను అలరించాయి.