బావిలో పడి బాలుడి మృత్యువాత

అమ్మలాలనలో.. నాన్న పాలనలో.. అల్లారుముద్దుగా పెరిగాడా బాలుడు.
బుడిబుడి నడకలతో.. బోసి నవ్వులతో.. ఇల్లంతా ఆనందం పూయిస్తున్న చిన్నారిపై..
ఎన్నో ఆశలు పెట్టుకున్నారా అమ్మానాన్న.
వంశోద్ధారకుడవుతాడని.. భవిష్యత్తుపై కలలుకంటూ.. ఉన్నంతలోనే హాయిగా జీవిస్తున్నారు.
విధి వారి ఆనందాన్ని ఆవిరి చేసింది.. ప్రమాదం రూపంలో.. ఆ బాలుడిని మృత్యుఒడి చేర్చింది.
పరమేష్ (పాత చిత్రం)
పుట్టపర్తి : ప్రమాదవశాత్తు బావిలోపడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని ఎనుములపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మహేశ్, సాయిలీలకు పరమేష్(3) ఒక్కడే సంతానం. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంట్లో అమ్మానాన్నతో ఆడుకున్నాడు. తండ్రి మహేష్ పనిచేయడానికి దుకాణానికి వెళ్లగా.. తల్లి ఇంట్లో వంట సామగ్రి శుభ్రం చేస్తుండగా పరమేష్ ఆడుకుంటూ బయటకు వచ్చాడు. ప్రమాదవశాత్తు పాడుబడిన బావిలో పడ్డాడు. ఇంటి పరిసరాల్లో కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. గ్రామస్థులు సమీపంలోని చిన్నబావిలో గాలించగా బాలుడి చొక్కా కనిపించడంతో బయటకు తీశారు. విగతజీవిగా మారిన ఒక్కగానొక్క కుమారుడిని చూసి ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విద్యుదాఘాతానికి యువకుడి బలి
ఎల్లయ్య (పాతచిత్రం)
పెనుకొండ పట్టణం: విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందాడు. పెనుకొండ మండలం వెంకటగిరపాళ్యంకు చెందిన ఎల్లయ్య (36) గ్రామంలో నూతనంగా ఇంటి నిర్మాణం ప్రారంభించారు. శనివారం సాయంత్రం ఇంటి గోడ క్యూరింగ్ కోసం నీళ్లు పడుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబసభ్యులు, స్థానికులు ఆయన హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఎమ్మెల్యే శంకరనారాయణ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.