Tue. Mar 28th, 2023

కరోనా పుట్టింది అక్కడే.. ప్రోత్సహించింది ఆ దేశమే.. వెలుగులోకి సంచలన నిజాలు..

రోనా వైరస్‌ మానవ సృష్టేనా.. ఈ మహమ్మారి పుట్టినిల్లు డ్రాగన్ కంట్రీయేనా.. పాత ప్రశ్నే.. మళ్లీ కొత్తగా వినిపిస్తోంది. ప్రపంచం మొత్తాన్ని ఆలోచింపజేస్తోంది.

ఈ ప్రశ్నకు సమాధానం ఒక పుస్తకం. అందులో ఏం రాసుంది.. చైనాతో పాటు సొంత దేశం అమెరికాను కూడా కార్నర్ చేస్తున్న ఆ పుస్తక రచయిత ఎవరు.. ఆయన చెప్పిన మిగతా షాకింగ్ న్యూస్ ఏంటి.. ఈ కథనంలో తెలుసుకుందాం..

64 కోట్ల మందిని ఆటాడుకుంది.. 66 లక్షల ప్రాణాలు తీసింది.. ప్రపంచ వ్యాప్తంగా ఏ ఒక్క దేశాన్నీ వదిలిపెట్టలేదు.. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఆ మరణమృదంగం వినిపిస్తూనే ఉంది. ఇదీ ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన టెర్రర్. కానీ.. దీని పుట్టినిల్లు ఎక్కడ.. ఏ కారణంగా ఎక్కడనుంచి ఇది మొదలైంది అనే సందేహం మాత్రం సందేహంగానే మిగిలిపోయింది. ఈ నిశ్శబ్దాన్ని చీలుస్తూ.. కరోనా జన్మస్థలం ఫలానా అంటూ తేల్చిపారేస్తోంది ఒక పుస్తకం. దాని పేరు.. ది ట్రూత్ అబౌట్ వూహాన్. రచయిత ఆండ్రూ హఫ్.. ఈయనొక అమెరికన్ సైంటిస్ట్.

వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ.. కేరాఫ్ చైనా. ఇదేనట కరోనా వైరస్ తయారీ కేంద్రం. గతంలో వూహాన్‌ ల్యాబ్‌లో పనిచేసిన అనుభవంతో ఆయన రాసిన పుస్తకం.. కరోనా మహమ్మారి గుట్టును విప్పేసింది. కరోనా అనేది మనుషులు సృష్టించిన వైరస్సే.. ఇది వూహాన్‌ ల్యాబ్‌ నుంచే లీకైంది.. అనేది ఆయన రాసిన పుస్తక సారాంశం.

గతంలోనే ఈయన వాదన ‘న్యూయార్క్‌ పోస్ట్‌’లో రిపోర్టైంది. లేటెస్ట్‌గా బ్రిటన్‌ పత్రిక ‘ది సన్‌’ అదే వెర్షన్‌ని సమర్థించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా పుట్టుపూర్వోత్తరాలపై చర్చ మొదలైంది. ‘వైరస్‌లపై పరిశోధనలు జరిపే ప్రయోగశాలలంటే ఆషామాషీ కాదు. అత్యంత రిస్క్‌తో కూడిన ఈ రిసెర్చ్‌లకు పకడ్బందీ బయో సెక్యూరిటీ ఉండాలి. కానీ, వూహాన్ ల్యాబ్‌లో అటువంటి భద్రతే లేదు. ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే నియంత్రించగలిగే చర్యలు కూడా ఆ ల్యాబ్‌లో లేవు. ఆ కారణంగానే కరోనా వైరస్‌ లీకై.. ప్రపంచాన్ని ఆవహించింది.’ అని పేర్కొన్నారు ఆండ్రూ హఫ్.

ఇక్కడే మరో షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. ఈ పరిశోధనలకు పరోక్షంగా ఊతమిచ్చింది అగ్రరాజ్యం అమెరికా. తన సొంత దేశమే అయినా.. అమెరికాను కార్నర్ చేయడంలో ఏమాత్రం వెనుకాడలేదా సైంటిస్ట్. ఈ డేంజరస్ బయో వెపన్‌ని చైనాకు మనమే బదిలీ చేస్తున్నాం.. అని అమెరికాను ఉద్దేశిస్తూ ఆ పుస్తకంలో రాశారు. వూహాన్‌ ల్యాబ్‌లో పని చేస్తున్న టైమ్‌లో అక్కడి పరిస్థితుల్ని చూసి అతడే భయపడిపోయారట.

గతంలో వైరస్‌లపై అధ్యయనం చేసే ‘ఎకోహెల్త్‌ అలయన్స్‌’కు వైస్‌ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు ఆండ్రూ హఫ్స్‌. గబ్బిలాల్లో కరోనా వైరస్‌ మూలాలపై ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ అధ్యయనాలు జరిగేవి. చైనాలోని వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌తో కలిసి పనిచేసింది ‘ఎకోహెల్త్‌ అలయన్స్‌’. కరోనా ఔట్‌బర్‌స్ట్ తర్వాత వూహాన్‌ ల్యాబ్‌పై ఆరోపణలు రావడంతో ట్రంప్‌ సర్కార్ అలర్టయింది. వెంటనే ‘ఎకోహెల్త్‌ అలయన్స్‌’కు ఫండింగ్ ఆపేశారు.

ఇటు.. ప్రాణాంతకమైన కరోనా వైరస్ మూలాలపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. ఫలితం మాత్రం శూన్యం. రెండేళ్ల కిందటే ప్రపంచం మొత్తం చైనాలోని అందమైన వూహాన్ నగరం వైపు అనుమానంగా చూసింది. అప్పట్లోనే కరోనా వైరస్‌ని వూహాన్ వైరస్‌గా పిలవడం మొదలైంది. చైనాలో ఎనిమిది మంది డాక్టర్లే ముందుకొచ్చి.. వూహాన్‌లోనే ఇది పుట్టిందని ఓపెన్‌గా చెప్పేశారు. తప్పుడు ఆరోపణలు చెయ్యొద్దని చైనా దేశం వాళ్ల నోళ్లు నొక్కేసింది. 2020 ఫిబ్రవరి 7న ఒక డాక్టర్‌ కోవిడ్‌తో చనిపోతూ.. వూహాన్‌ పరిశోధనలపై సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పుడీ కొత్త పుస్తకం కూడా అదే చెబుతోంది. కరోనా పాపం చైనాదే కాదు అమెరికాది కూడా అని కార్నర్ చేస్తోంది. సెప్టెంబర్ 11 ఎటాక్స్ తర్వాత.. అమెరికాలో ఇదే అతిపెద్ద ఇంటిలిజెన్స్ ఫెయిల్యూర్. డబ్ల్యుటీసీ ట్విన్ టవర్లను నేలకూల్చిన తాలిబన్ల వ్యూహాన్ని పసిగట్టలేకపోయినట్టే.. వూహాన్‌లో కరోనా భూతం పుట్టుకను కూడా తేలిగ్గా తీసుకుని.. తర్వాత నాలిక్కర్చుకుంది అమెరికా.

వూహాన్‌ లాంటి సైతాన్ సిటీల్లో వైరస్‌ల మీద ప్రయోగాల ముసుగులో కొత్తకొత్త వైరస్‌లు పుట్టిస్తుంటే.. అమెరికా వాటికి డబ్బులిచ్చి ఎంకరేజ్ చేసిందన్నమాట. బయోసేఫ్టీ, బయో సెక్యూరిటీ, రిస్క్ మేనేజ్‌మెంట్ అన్ని విషయాల్లోనూ అట్టర్‌ఫ్లాప్ అయిన అమెరికాను తిట్టిపోస్తోంది ప్రపంచ సమాజం. ఇప్పటివరకూ 64 కోట్ల మంది శరీరాల్లో జొరబడి.. 66 లక్షల మంది ప్రాణాలు తీసిన కోవిడ్ భూతానికి ప్రత్యక్ష కారణం చైనా అయితే.. పరోక్ష కారణం అమెరికా. అగ్రరాజ్యం నిర్లక్ష్యానికి ప్రపంచం మొత్తం భారీ మూల్యం చెల్లించాల్సి రావడం.. ఏంటి మన ఖర్మ కాకపోతే.. అంటూ వాపోతున్నారు సదరు సైంటిస్ట్.