Tue. Mar 28th, 2023

అదానీ కోసం బయ్యారం బలి!

య్యారంలో స్టీల్‌ ప్లాంటుకు భూమి సరిపోదన్నారు.. కావాల్సినంత భూమిస్తామని రాష్ట్రం హామీ ఇచ్చిం ది. లేదులేదు.. బయ్యారం ఖనిజంలో నా ణ్యత లేదన్నారు..

పక్కనే ఉన్న బైలడిల్లా నుంచి తెచ్చుకోవచ్చని రాష్ట్రం చెప్పింది.Adani Group | బయ్యారంలో స్టీల్‌ ప్లాంటుకు భూమి సరిపోదన్నారు.. కావాల్సినంత భూమిస్తామని రాష్ట్రం హామీ ఇచ్చిం ది. లేదులేదు.. బయ్యారం ఖనిజంలో నా ణ్యత లేదన్నారు.. పక్కనే ఉన్న బైలడిల్లా నుంచి తెచ్చుకోవచ్చని రాష్ట్రం చెప్పింది. లే దులేదు.. లాభదాయకం కాదు అన్నారు.. ఎందుకు కాదో చెప్పాలని తెలంగాణ కోరింది.. బైలడిల్లాను ప్రధాని తన సన్నిహితుడి చేతిలో పెట్టడానికి.. నిండు పార్లమెంటులో తెలంగాణకు ఇచ్చిన హామీని కూడా కాలదన్నారని ఇప్పుడు స్పష్టమైంది.

హైదరాబాద్‌ : తమ ఆప్తుడికి మేలు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు చేసిన మరో అన్యాయం బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయాల్సిన కేంద్రం, అనేక కుంటిసాకులు చెప్తూ ప్లాంటు ఏర్పాటుకు ఎందుకు నిరాకరించిందో తేటతెల్లమైంది. ప్రధాని నరేంద్రమోదీ తన అనుంగు అనుచరుడికి మేలు చేసేందుకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేసిన వైనం విస్తు గొలుపుతున్నది.

బయ్యారంలో స్టీల్‌ ప్లాంటు పెట్టి ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా గనుల నుంచి ఇనుప ఖనిజం సరఫరా చేసేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు మొరపెట్టుకొన్నా, మోదీ సర్కారు ఒప్పుకోలేదు. బయ్యారంలో అసలు స్టీల్‌ప్లాంటు పెట్టడమే లాభదాయకం కాదని బుకాయిస్తూ వచ్చింది. బైలడిల్లా గనులను అదానీ గ్రూప్‌కు అడ్డదారిలో కట్టబెట్టేందుకే కేంద్రం ఈ వాదన లేవనెత్తిందని ఇప్పుడు తేలిపోయింది. బైలడిల్లా గనులను కేంద్రం అదానీ గ్రూప్‌కు కట్టబెట్టిన తీరును తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మన్నె క్రిషాంక్‌ ట్విట్టర్‌లో వివరించారు.

రాష్ట్రం విన్నపాలు బుట్టదాఖలు

ఖమ్మం జిల్లాలోని బయ్యారంలో స్టీల్‌ప్లాంటు ఏర్పాటు తెలంగాణ ప్రజల దశాబ్దాల డిమాండ్‌. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో ఇక్కడ ప్లాంటు ఏర్పాటుచేస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా హామీ ఇచ్చింది. యూపీఏ ప్రభుత్వం పోయి నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2014 మే నెలలో స్టీల్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు కోసం పలు ప్రాంతాలను పరిశీలించారు.

ముడి ఇనుము సరఫరా, విద్యుత్తు, బొగ్గు, నీటి సరఫరాకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేశారు. నిజానికి ఇలాంటి అధ్యయనాలు ఉమ్మడి ఏపీలో ఎన్నోసార్లు జరిగాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇక్కడి ఇనుప ఖనిజాన్ని ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. మోదీ సర్కారు వచ్చాక కేంద్రం ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించింది. బయ్యారంలో ఉన్న ఖనిజంలో నాణ్యత లేదని, ప్లాంటు పెట్టడం లాభసాటి కాదని అడ్డదిడ్డ వాదనలు లేవదీసింది.

రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి కూడా అదే పాట పాడారు. ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా గనులు బయ్యారానికి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి, బయ్యారంలో ప్లాంటు పెట్టి అవసరమైతే బైలడిల్లా గనుల నుంచి ఇనుప ధాతువును తెచ్చుకొనేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం 2015 నవంబర్‌ 7వ తేదీన కేంద్రానికి లేఖ రాసింది. తర్వాత కూడా ఖనిజం సరఫరా కోసం నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ)తో పాటు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నది. అనేకసార్లు లేఖలు రాసింది. కానీ, మోదీ సర్కారు ఏనాడూ స్పందించలేదు. చివరకు బయ్యారంలో నాణ్యమైన ఖనిజం లేనందున అక్కడ ప్లాంటు ఏర్పాటు చేయటం సాధ్యపడదని కేంద్ర మంత్రులు ప్రకటించారు.

అదానీ వయా పోస్కో

బైలడిల్లా గనుల నుంచి బయ్యారానికి ఇనుప ధాతువు సరఫరాపై నిర్ణయం తీసుకోకుండా కేంద్రం మూడేండ్లపాటు తాత్సారం చేసింది. ఇప్పుడే అసలు కథ మొదలైంది. సీన్‌లోకి దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీ వచ్చింది. ఈ కంపెనీకి బైలడిల్లా నుంచి ఏటా 1.20 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజం సరఫరా చేసేందుకు కేంద్ర క్యాబినెట్‌ 2018, ఏప్రిల్‌ 25న ఆమోదం తెలిపింది. 2018 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి 31వ తేదీ వరకు మూడేండ్ల పాటు ఖనిజాన్ని సరఫరా చేసేలా ఒప్పందం కుదిరింది.

ఉన్నట్టుండి 2018 నవంబర్‌ 20న బైలడిల్లా గనులకు అదానీ గ్రూప్‌ యజమానిగా తెరపైకి వచ్చింది. బైలడిల్లా ఐరన్‌ ఓర్‌ ప్రైవేట్‌ కంపెనీ లిమిటెడ్‌ తమ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ అని సెబీకి 2018 నవంబర్‌ 21న అదానీ గ్రూప్‌ అధికారికంగా తెలిపింది. కథ ఇంతటితో ఆగిపోలేదు. పోస్కోకు ఖనిజం సరఫరా చేసే ఒప్పందం 2021, మార్చి 31తో ముగిసింది. ఇప్పుడే కథ ైక్లెమాక్స్‌కు వచ్చింది. పోస్కోతో కలిసి గుజరాత్‌లోని ముంద్రాలో రూ.37,500 కోట్లతో అతిపెద్ద స్టీల్‌ప్లాంటు ఏర్పాటుచేసేందుకు 2022, జనవరి 13న అదానీ గ్రూప్‌ ఒప్పందం చేసుకొన్నది. ఈ విషయాన్ని అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు.

అటు ఇటు తిరిగి అదానీ ఇంటికి

మనదేశంలో ప్రైవేటు రంగంలో ఉన్న అతిపెద్ద పోర్టు ముంద్రా. ఇది గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో ఉన్నది. ఈ పోర్టు అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ (ఏపీ సెజ్‌)లో ఒక భాగం. అంటే.. ముంద్రా పోర్టు, ఏపీ సెజ్‌ మొత్తం అదానీ సొంతం. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా గనుల నుంచి ఖనిజాన్ని తీసుకెళ్లి ఎక్కడో దేశానికి పశ్చిమ తీరాన ఉన్న ముంద్రాలో పోస్కో, అదానీ గ్రూప్‌ కలిసి నెలకొల్పుతున్న స్టీల్‌ ప్లాంటుకు సరఫరా చేస్తారన్నమాట. అసలు విషయం ఏమిటంటే బైలడిల్లా గనులకు యజమాని అదానీ గ్రూప్‌. ముంద్రాలో పెడుతున్న ప్లాంటు యజమాని కూడా అదానీ గ్రూపే. అంటే పరోక్షంగా బైలడిల్లా ఇనుప గనులను అదానీకి మోదీ సర్కారు గంపగుత్తగా రాసిచ్చేసిందన్నమాట. మధ్యలో పోస్కో అనే కంపెనీని పెట్టి కేంద్రం ఇంత నాటకం ఆడినట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

బయ్యారం దూరం.. ముంద్రా దగ్గరా?

ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా గనుల నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టు దాదాపు 1,800 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఖమ్మంలోని బయ్యారం నుంచి బైలడిల్లా 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే పక్కనే ఉన్న బయ్యారానికి ఖనిజం ఇవ్వమంటే తిరస్కరించిన ప్రధాని మోదీ, తన సొంత రాష్ట్రంలో ఎక్కడో ఉన్న ముంద్రాకు ఖనిజాన్ని తరలించుకుపోయేందుకు అనుమతివ్వటం గమనార్హం. ఏపీలోని విశాఖపట్టణంలోని స్టీల్‌ప్లాంటుకు కూడా ఖనిజం బైలడిల్లా నుంచే వస్తుంది. విశాఖకు బైలడిల్లా 500 కిలోమీటర్లు. బయ్యారానికి తక్కువ నాణ్యత ఉన్నదైనా ఏదో ఒక ఖనిజం ఉన్నది కానీ, విశాఖకు సమీపంలో అసలు సొంత గనులే లేవు. అలాంటి విశాఖలో ప్లాంటు పెట్టగాలేంది.. బయ్యారంలో ఎందుకు పెట్టకూడదని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కేంద్రాన్ని ప్రశ్నించింది. అయినా, కేంద్రం మొండివైఖరి ప్రదర్శించటానికి అసలు కారణం ఇదని తెలంగాణవాదులు పేర్కొంటున్నారు.

మోదీజీ.. ఇది సిగ్గుచేటు

ప్రధాని మోదీకి దేశం కంటే ఆశ్రితుల ప్రయోజనాలే ఎక్కువ కావడం సిగ్గుచేటు. బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ కోసం బైలడిల్లా ఐరన్‌ ఓర్‌ను కేటాయించి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీని నిలుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఏండ్లుగా కోరుతున్నా పట్టించుకోని మోదీ సర్కారు, ఆ గనులను అదానీ గ్రూప్‌కు కట్టబెట్టింది.

-కేటీఆర్‌