Sat. Jun 10th, 2023

భారత హైకమిషన్ కార్యాలయంపై దాడులు.. ధ్వంసం: త్రివర్ణ పతాకాన్ని కిందికి దించి..

లండన్: పంజాబ్ లో ఖలిస్తాన్ మద్దుతుదారుడు, వారిస్ పంజాబ్ దే అధినేత అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తోన్నారు. రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు.

విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడే ప్రమాదం ఉందంటూ అందిన వార్తల నేపథ్యంలో అతని కోసం పెద్ద ఎత్తున అన్వేషణ సాగిస్తోన్నారు. కేంద్ర బలగాల సహాయాన్ని కూడా తీసుకుంటోంది పంజాబ్ ప్రభుత్వం. ఇప్పటికే అమృత్ పాల్ సింగ్ కు చెందిన అనుచరులను అరెస్ట్ చేశారు.

ఈ పరిణామాలు- బ్రిటన్ లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. అవాంఛిత సంఘటనలకు కారణం అయ్యాయి. లండన్ ఆల్డ్‌విచ్ 4 ఎన్ఏ, డబ్ల్యూసీ2బీలో గల భారత హైకమిషన్ కార్యాలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడులు చేశారు. భద్రత వలయాన్ని ఛేదించుకుని మరీ వారు కార్యాలయానికి చేరుకున్నారు. విధ్వంసం సృష్టించారు. హైకమిషన్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కార్యాలయ భవనంపై ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని కిందికి దించి, తమ ఖలిస్తాన్ జెండాను ఎగురవేశారు.

ఓ వ్యక్తి భారత్ హైకమిషన్ కార్యాలయాన్ని మొదటి అంతస్తు పైకి చేరుకుని జాతీయ పతాకాన్ని కిందికి దించి, ఖలిస్తాన్ జెండాను ఎగురవేస్తోన్న దృశ్యానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటన ఆల్డ్‌విచ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. పెద్ద సంఖ్యలో భారత హైకమిషన్ కార్యాలయానికి చేరుకున్న ఖలిస్తాన్ మద్దతుదారులను చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించారు. దీన్ని వారు ప్రతిఘటించడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఖలిస్తాన్ కు అనుకూలంగా వారు చేసిన నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి. అదనపు పోలీసు బలగాలను రప్పించిన అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. భారత్ లోని బ్రిటన్ రాయబార కార్యాలయానికి సమన్లను జారీ చేసింది. లండన్ లో చోటు చేసుకున్న ఘటనకు సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

లండన్ లో గల తమ కార్యాలయంపై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడికి తమ నిరసనను తెలియజేస్తోన్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటన పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తోన్నామని భారత్ లోని బ్రిటన్ సీనియర్ అంబాసిడర్ క్రిస్టీనా స్కాట్ అన్నారు. ఇలాంటి చర్యలను తాము ఎంతమాత్రం కూడా సమర్థించబోమని వ్యాఖ్యానించారు. జరిగిన ఘటన పట్ల విచారిస్తోన్నామని, సమగ్ర నివేదికను కోరినట్లు తెలిపారు.

Leave a Reply