Tue. Mar 28th, 2023

దేశంలో మరో కొత్త స్కామ్.. సినిమాను తలదన్నే డైరెక్షన్.. GST రిజిస్ట్రేషన్‌ కోసం ఇలా..

మన దేశానికి కుంభకోణాలేమీ కొత్త కాదు. పెరుగుతున్న సాంకేతికతను వినియోగించి దొరక్కుండా తప్పులు చేయడానికి మోసగాళ్లు కొత్త కొత్త మార్గాలు కనిపెడుతున్నారు.

కానీ నిజం ఎక్కువ కాలం దాగదు కదా, అందుకే దొరికిపోతున్నారు. తాజాగా గుజరాత్‌ లో బయటపడిన ఈ కుంభకోణాన్ని చూస్తే, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి తక్కువేం కాదు. విశాల్ నటించిన అభిమన్యుడు సినిమాను చూసి ఇన్‌ స్పైర్ అయినట్లున్నారు.

సామాన్యుల ఆధార్ సవరించి..

బోగస్ GST రిజస్ట్రేషన్ నంబర్లు పొందేందుకు 1,500 ఆధార్ కార్డులను అక్రమంగా వినియోగించినట్లు తమ విచారణలో తేలినట్లు గుజరాత్ రాష్ట్ర GST విభాగం ప్రకటించింది. గత 8 నెలల్లోనే ఈ వ్యవహారం అంతా నడిచినట్లు పేర్కొంది. సూరత్, పాలిటానాలో నివసిస్తున్న స్థానికుల ఆధార్ లో మొబైల్ నంబరును సవరించి, కార్డుదారులకు తెలియకుండానే వారి పేరిట పాన్ నంబర్, జీఎస్టీ రిజిస్ట్రేషన్ పొందారని తెలిపింది.

సూరత్ లో భారీగా..

బోగస్ బిల్లింగ్‌ కు చెక్ పెట్టేందుకు ఫిబ్రవరి 7న సూరత్, భావ్‌నగర్, అహ్మదాబాద్, ఆనంద్, రాజ్‌ కోట్‌ లతో సహా ఇతర ప్రాంతాల్లోని అనుమానిత సంస్థలపై GST డిపార్ట్‌ మెంట్ స్పాట్ వెరిఫికేషన్ నిర్వహించింది. ఒక్క సూరత్‌ లోనే 75 కంపెనీలకు పైగా నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ లో, నకిలీ పత్రాలు ఉన్నట్లు తేలింది. ఆండ్రాయిడ్ మొబైల్ లో ఓ యాప్‌ ద్వారా ఆధార్ నుంచి పాన్ కార్డులు సృష్టించినట్లు గుర్తించారు. ఈ కుంభకోణంలో వినియోగించిన మొబైల్స్, ల్యాప్‌ టాప్ లు, ఆధార్ కార్డులు, ఇతర డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మిగిలిన రాష్ట్రాలూ భాగస్వాములే:

ప్రభుత్వ సాయం పేరిట తమను ఆధార్ కేంద్రాలకు తీసుకెళ్లి వేలిముద్రలు తీసుకున్నారని పాలిటానాలోని పలువురు నివాసితులు GST అధికారులకు తెలిపారు. ఇలా చట్టవిరుద్ధంగా జరిగిన 470 GST రిజిస్ట్రేషన్లను సంబంధిత అథారిటీ గుర్తించింది. వాటిలో 118 గుజరాత్‌ కు చెందినవి కాగా.. మిగిలినవి ఇతర రాష్ట్రాలకు చెందినవని అధికారులు స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా 2700కు పైగా:

470 బోగస్ రిజిస్ట్రేషన్లను తనిఖీ చేస్తున్న సమయంలో.. ఈ తరహాలో దేశవ్యాప్తంగా జరిగిన మరో 2,700కు పైగా GST రిజస్ట్రేషన్లను గుర్తించడం సంచలనం సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించి పాలిటానాలో FIR దాఖలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. సూరత్ లోని 75 సంస్థల వెరిఫికేషన్‌ లో 61 బోగస్ బిల్లింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్లు, అహ్మదాబాద్‌ లో తనిఖీ చేసిన 24 సంస్థల్లో 12 చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలిదని వెల్లడించారు.