Tue. Mar 28th, 2023

శ్రీలంకతో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్.. కీలక ప్లేయర్ ఔట్..!

శ్రీలంక వర్సెస్ ఇండియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. గౌహతిలో మధ్యాహ్నం 1.30 గంటలకు తొలి వన్డే ప్రారంభం కానుంది.

టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న ఉత్సాహంతో టీమిండియా వన్డేల్లోకి అడుగు పెడుతుండగా, వన్డే సిరీస్‌నైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో శ్రీలంక ఆటగాళ్లు కసరత్తు చేస్తున్నారు. దీంతో రేపటి ప్రారంభ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుందని క్రికెట్ అభిమానులు అంచనా వేస్తున్నారు.

టీ20 సిరీస్‌లో ఎక్కువగా యువ ఆటగాళ్లకే అవకాశం కల్పించారు. రేపటి నుంచి జరిగే మ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్, బుమ్రా, షమీ వంటి ఆటగాళ్లు కూడా ఆడబోతున్నారు. మరికొద్ది గంటల్లో మ్యాచ్ ప్రారంభంకానున్ననేపథ్యంలో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. టీమిండియా ఆటగాళ్లు గౌహతి చేరుకున్నప్పటికీ బుమ్రా గౌహతికి చేరుకోలేదు.

శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు బూమ్రాను సెలక్టర్లు ఎంపిక చేశారు. జస్ప్రిత్ బుమ్రా ఫిట్‌గా ఉన్నాడని భావించిన సెలెక్టర్లు వన్డే సిరీస్ కు ఎంపికచేశారు. కానీ బుమ్రా పూర్తిస్థాయిలో గాయం నుంచి కోలుకోలేదని తెలుస్తోంది. త్వరలో ఆస్ట్రేలియాతో టెస్ట్, జరిగే వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఎలాంటి రిస్క్ తీసుకోదలచుకోలేదు. దీంతో బుమ్రాను చివరి క్షణంలో సిరీస్ నుండి దూరంగా ఉంచినట్లు తెలుస్తోంది. బుమ్రా గతేడాది సెప్టెంబర్ 22 నుంచి వన్డే క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు.